తనకంటూ ఒక ‘జాతీయ రాజకీయ వేదిక’ కోసం కసరత్తు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశయం ఎంత మేరకు నెరవేరుతుందన్న స్పష్టత ఇప్పటిదాకా లేదు. కానీ.. ఆయనెత్తుకున్న ఫెడరల్ ఫ్రంట్ స్ట్రాటజీకైతే పరోక్ష మద్దతు పెరుగుతోంది. కేసీఆర్ చెబుతూ వస్తున్న నాన్-కాంగ్రెస్, నాన్-బీజేపీ పాలనకు కేంద్రంలో మరోసారి ఛాన్స్ దక్కవచ్చన్న మాటను మరికొన్ని పార్టీలు కూడా వల్లె వేయడం తెరాస వర్గాల్ని సంతోషింప జేస్తోంది.

తాజాగా.. మాయావతికే నా వోటు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్లోగన్.. తెలంగాణ భవన్లో రీసౌండ్ ఇస్తోంది. శుక్రవారం లక్నో వెళ్లిన పవన్.. పొత్తు చర్చలు జరిపి.. మాయావతిని ప్రధానిగా చూడాలని తపనగా ఉందనడం.. నేషనల్ మీడియాని తాకేసింది. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కూడా వార్తల్లో నిలిచింది. ఏపీలోని మరో పార్టీ వైసీపీ కేసీఆర్‌కి ఓపెన్ సపోర్ట్ ఇవ్వడానికి సన్నద్ధత తెలిపింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా గతంలో అనేకసార్లు కేసీఆర్ నుంచి రాజకీయ మద్దతు కోరిన మాట వాస్తవం. తెరాసతో పొత్తుకు ప్రయత్నించినట్లు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పేశారు.

ఏపీలోని మూడు ప్రధాన పార్టీలూ కేసీఆర్‌కి, కేసీఆర్ రాజకీయ సిద్ధాంతాలకు పరోక్షంగా జిందాబాద్ కొట్టినవారేనంటూ తెరాస శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ మేరకు గులాబీ దళాలు పండగ చేసుకుంటున్నాయి. ఇప్పటికే రైతుబంధు పథకాన్ని పేర్లు మార్చి, చిన్నపాటి కరెక్షన్స్‌తో బీజేపీ సహా అనేక పార్టీలు కాపీ కొట్టేశాయని తెరాస దండోరా వేసుకుంటోంది. ఇప్పుడు జనసేన కూడా ఫెడరల్ భావనతో తమ దారిలోకి రావడంతో.. తెరాస సైనికులు ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *