ఎక్కువ మంది వయసుమీరి ముసలోళ్లయిపోవడం.. బర్త్ రేట్ తగ్గిపోవడం లాంటి పరిణామాలతో జపాన్ దేశానికి జనాభా కరువొచ్చింది. జనం తగ్గిపోవడం అనేది ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక సంక్షోభం. ఉద్యోగాల సృష్టి ఎంత వేగంగా జరుగుతున్నా.. పని చేసే మనుషులకే తీవ్ర కొరతలక్కడ. ఈ లోటు తీర్చడానికే ముందుకొచ్చింది ఎరిసా.. ఒక అందమైన చిట్టి రోబో..! Aruze గేమింగ్, చికాగోకి చెందిన THK సంయుక్తంగా డెవలప్ చేసిన ఎరిసా.. ఇప్పటికే టోక్యోలో లాంచ్ అయింది.

2020 ఒలంపిక్స్‌కి వేదికైన టోక్యో నగరం.. సదరు ఇంటర్నేషనల్ ఈవెంట్ కోసం ఇప్పట్నుంచే ముస్తాబవుతోంది. 1964 తర్వాత మొట్టమొదటిసారిగా దక్కిన ఈ అవకాశాన్ని బాగా సెలబ్రేట్ చేసుకోవాలన్న ప్లాన్లో వుంది జపాన్ దేశం. ప్రపంచ నలుమూలల నుంచీ మిలియన్ల కొద్దీ క్రీడాభిమానులు, క్రీడాకారులు టోక్యోకు రానుండడంతో మెట్రోపాలిటన్ అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో లేబర్ కొరతను తీర్చడం కోసం ఎరిసా అనే అరుదైన రోబోని రూపొందించింది టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్.

సబ్వేలోని రైల్వే స్టేషన్లలో ఈ రోబోల్ని వినియోగిస్తున్నారు. ఆరడుగుల ఎత్తుండి.. టచ్ స్క్రీన్ సదుపాయం కలిగిన ఈ రోబో.. విజిటర్స్‌కి ఒక మంచి గైడ్‌లా పని చేస్తుంది. ఇంగ్లీష్, జపనీస్, చైనీస్, కొరియన్ భాషలను అనర్గళంగా మాట్లాడగల ఎరిసా.. విజిటర్స్‌కి ఎటువెళ్లాలో డైరెక్షన్స్ ఇవ్వడం.. రెస్ట్ రూమ్స్‌కి దారి చూపించడం లాంటి పనుల్ని చక్కగా చేసిపెడుతుంది.

లోకల్ టూరిస్ట్ ప్లేసెస్ గురించిన వివరాలు చెబుతూ.. అడిగిన వెంటనే సిగ్గుపడకుండా సెల్ఫీలు కూడా ఇస్తూ అలరిస్తుంది. ఇప్పటికే రెండు సబ్వే స్టేషన్లలో వీటిని పరీక్షించి చూశారు. ప్రయాణీకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఎరిసా రోబోలు.. 2020 ఒలంపిక్స్ ఆకర్షణల జాబితాలో నిలవడం గ్యారంటీ!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *