తెలుగు రాజకీయాల్ని డైరెక్టర్ వర్మ చెండాడుకుంటున్నాడు. ‘వెన్నుపోటు’ అనే హార్డ్ సెంటిమెంట్‌ని అడ్డం పెట్టుకుని అతడు పాల్పడుతున్న అరాచకాలకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడేలా లేదు. లక్ష్మీస్ ఎన్టీయార్ పేరుతో ఒక విచిత్రమైన బయోపిక్ ప్లాన్ చేసి.. దాని ప్రమోషన్ కోసం ఇటీవలే ‘వెన్నుపోటు’ పాటను బైటికొదిలి రచ్చకెక్కేశాడు కిర్రాక్ సెలబ్రిటీ రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఆ టెంపోను అదే స్పీడ్‌తో కంటిన్యూ చేసుకుంటున్నాడు. ఎన్టీయార్ జీవితంలోని రెండు వెన్నుపోట్లను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో వర్మ లేవదీసిన చర్చ.. దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లోనూ కాక పుట్టిస్తోంది. నాదెండ్ల వెన్నుపోటు, వైస్రాయ్ హోటల్ వెన్నుపోటు.. రెండింట్లో ఏది పవర్‌ఫుల్ అంటూ ట్విట్టర్లో ఒపీనియన్ పోల్ పెట్టి.. దాని ఫలితాల్ని కూడా ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తున్నాడు.

ఇప్పుడు జనసేనలో నంబర్2గా వున్న నాదెండ్ల మనోహర్ గురించి కూడా చురక వేసి.. నాన్న నాదెండ్ల భాస్కర్ రావులాగే నవ్వుతూ వెనకే తిరుగుతున్న మనోహర్.. పవన్ కళ్యాణ్‌కి ఎప్పుడో ఒకప్పుడు వెన్నుపోటు పొడవక తప్పదేమో అంటూ ‘లేని సందేహాల్ని’ పుట్టించేశాడు. ఆయా పార్టీలు వర్మ కామెంట్స్‌ని ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నాయన్నది వాళ్ళకే తెలియాలి.

ఒకవైపు పోలీస్ కేసులు, లీగల్ నోటీసులు కొనసాగుతున్నప్పటికీ వర్మ తన తాకిడిని తగ్గించే పరిస్థితిలో లేడు. ఏపీ రాజకీయాలతో సరిపెట్టుకోకుండా తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ మీద కూడా పడ్డాడితడు. శనివారం నాటి ప్రెస్‌మీట్ లో తెలంగాణ సీఎం కేసీఆర్.. చంద్రబాబుపై విరుచుకుపడిన వైనాన్ని కూడా తన ‘వెన్నుపోటు’ పబ్లిసిటీకి వాడేసుకోవడం వర్మకే చెల్లింది. ”మిగతా వారిలా వెన్నుపోటు పొడవకుండా ‘ముందుపోటు’ పొడిచే కేసీఆర్ అంటే అందుకే నాకంత ఇష్టం” అంటూ ట్వీట్ చేశాడు.

దీంతో వర్మ తాలూకు సెగ తెలంగాణకు సైతం తాకినట్లయింది. బాలయ్య తీసే ఎన్టీయార్ బయోపిక్ రెండు రాష్ట్రాల్లోనూ వసూళ్ల పంట పండించుకుంటుందా లేదా అనే సంశయం అటుంచితే.. వర్మ తన ‘లక్ష్మీస్ ఎన్టీయార్’కి మాత్రం జంట రాష్ట్రాల్లో విపరీతమైన పబ్లిసిటీ రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ‘వెన్నుపోటు’కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి.. తెలుగు రాజకీయాల్ని కెలికిపారేస్తున్న వర్మ కొన్ని పొలిటికల్ సర్కిల్స్‌కి కొరకరాని కొయ్యలా తయారయ్యాడన్నది నిజం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *