టాలీవుడ్ ద‌ర్శకనిర్మాత విజ‌య బాపినీడు అనారోగ్యంతో మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. ఎన్నో బ్లాక్ బ‌స్టర్స్‌ సినిమాలను తెలుగు ప‌రిశ్రమ‌కు అందించిన ఆయన అస‌లు పేరు గుత్తా బాపినీడు చౌదరి. ఇండస్ర్టీలో మాత్రం విజ‌య బాపినీడుగా సుప‌రిచితం. 1936 సెప్టెంబరు 22న సీతారామస్వామి-లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలో కల చాటపర్రులో ఆయ‌న జన్మించారు.

 

ఏలూరు‌లోని సీఆర్ఆర్ కళాశాలలో మేథ్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్న ఆయన.. విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పని చేశారు. ఆ తర్వాత గ్లామర్ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టారు. చిరంజీవి, శోభ‌న్‌బాబుల‌తో హిట్ చిత్రాలు నిర్మించిన ఘనత ఆయన సొంతం. ఆయన ద‌ర్శకుడిగా డబ్బు డబ్బు డబ్బు, పట్నం వచ్చిన పతివ్రతలు, మగ మహారాజు, మహానగరంలో మాయగాడు, హీరో, భార్యామణి, మహారాజు, కృష్ణగారడి, మగధీరుడు , నాకు పెళ్ళాం కావాలి, ఖైదీ నెంబరు 786, దొంగకోళ్ళు, మహారాజశ్రీ మాయగాడు, జూలకటక, మహాజనానికి మరదలు పిల్ల, గ్యాంగ్‌లీడర్, బిగ్ బాస్, కొడుకులు, ఫ్యామిలీ వంటి చిత్రాలు చేశారు. నిర్మాతగా యవ్వనం కాటేసింది అనే ఫిల్మ్ చేశారు. ఆయ‌న మృతికి ప‌రిశ్రమ‌కి చెందిన ప్రముఖులు నివాళులు అర్పించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *