‘రిటర్న్ గిఫ్టు రెడీగా వుంది..’ అంటూ కొన్నాళ్లుగా ఊరిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కోసం.. సహజంగానే ఏపీ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే.. తలసాని శ్రీనివాసయాదవ్ లాంటి కొందరు కరడుగట్టిన బాబు-వ్యతిరేకులు బెజవాడ గడ్డ మీదకొచ్చి పెట్టిన తిట్లు-శాపనార్థాలతో తెలుగుదేశం శ్రేణుల కడుపులో దేవేసినట్లయింది. ఇదే తాకిడి ఎన్నికల దాకా కంటిన్యూ అవుతుందన్న అంచనాక్కూడా వచ్చేశారు. కానీ.. అనూహ్యంగా ఆ కెలుకుడు అక్కడితోనే ఆగిపోయింది.

నిజానికి.. తెలంగాణలో జరగాల్సిన వ్యవహారాలే పూర్తిగా స్తంభించిపోయ్యాయి. కీలకమైన క్యాబినెట్ విస్తరణ మీదే క్లారిటీకి రాలేక కేసీఆర్ సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ముహూర్తాలు కుదరకో.. మరో ఇంటర్నల్ స్ట్రాటజీతోనో క్యాబినెట్ ఏర్పాటును పూర్తిగా పక్కన పెట్టేశారు. మరోవైపు.. ఫెడరల్ ఫ్రంట్ కోసం చెయ్యాల్సిన హడావిడి కూడా పెండింగ్‌లో పడిపోయింది. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎన్నికల మీద, పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెట్టారు కేసీఆర్.

తాను ఫిక్స్ చేసుకున్న ‘టార్గెట్-16’ మీద మాత్రమే కేసీఆర్ పూర్తి ఏకాగ్రత పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విజయంతో అతి విశ్వాసం ప్రదర్శించవద్దని క్యాడర్‌కి సూచించిన కేసీఆర్.. తాను సైతం అదే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే కేటీఆర్-హరీష్ కోసం ప్రత్యేక స్కెచ్ గీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టాలా వద్దా అనే అంశంపై కేసీఆర్‌ లో పునరాలోచన మొదలైంది. ఏపీలో ప్రత్యక్షంగా బరిలోకి దిగాలని మొదట్లో అనుకున్నప్పటికీ.. ఆ స్ట్రాటజీ నుంచి పూర్తిగా వెనక్కు తగ్గేశారు.

కేటీఆర్‌ని లోటస్ పాండ్‌కి పంపి వైసీపీని ఫెడరల్ ఫ్రంట్‌లోకి ఆహ్వానించినప్పటికీ.. అటువైపు నుంచి ఆశించినంత స్పందన రాకపోవడం కేసీఆర్‌ని ఇరకాటంలో పడేసింది. టీఆరెస్‌తో అంటకాగడం అసలుకే మోసమన్న ఆందోళన వైసీపీని కూడా వెనకడుగేసేలా చేసింది. ఈ క్రమంలో ఏపీలో తాము అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ప్లాన్B సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ తేదీకి ముందు.. ఒక పత్రికా ప్రకటన ద్వారా జగన్‌కి మద్దతు తెలపాలన్నది టీఆరెస్ తాజా ‘ఏపీ స్ట్రాటజీ’! కేసీఆర్‌కి ఈ సలహా ఇచ్చింది కూడా జగనేనని తెలుస్తోంది. పైగా.. ఇలా చేయడమే శ్రేయస్కరమని రెండు పార్టీలూ భావిస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *