అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి తనకు 5.7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 35 వేల కోట్లు) నిధులివ్వాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు. (ఈ నిధులు మంజూరు కావాలంటే డెమోక్రాట్లు ఇందుకు ఒప్పుకుని తీరాల్సిందే). తన సూచనకు డెమోక్రాట్లు అంగీకరిస్తే.. ఇక్కడికి (యూఎస్ కు) పిల్లలతో వచ్చే శరణార్థులు, ఇమ్మిగ్రెంట్లకు మూడేళ్ళ పాటు రక్షణ కల్పించేందుకు సమ్మతిస్తానని   ఆయన అన్నారు. కానీ ఈ  ‘డీల్’‌‌కు డెమోక్రాట్లు ససేమిరా అన్నారు. ఈ ప్రతిపాదన తమకు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదని హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తోసిపుచ్చారు. గతంలో కూడా మీరిలాగే అసంబద్ధ హామీలు ఇచ్చారని, వీటిని తాము నమ్మే పరిస్థితిలో లేమని ఆమె అన్నారు.
కాగా-తన ప్రపోజల్ కు డెమోక్రాట్లు మద్దతునిస్తారని ఆశించానని, కనీసం దేశంలో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యవస్థల పాక్షిక మూసివేత సమస్య పరిష్కారమైనా అవుతుందని భావించానని ట్రంప్ అన్నారు. అసలు ఈ  ‘ట్రాజెడీ’  (శరణార్థుల సమస్య) ని కొంతవరకైనా నివారించాలన్నదే తన బాధ అని అని పేర్కొన్నారు. అమెరికాలో ఈ షట్ డౌన్ ఐదో వారానికి చేరుకున్న సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో రెండు వేల మైళ్ళ పొడవునా గోడ బదులు స్టీల్ కంచె ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాన్ని కూడా ట్రంప్ వ్యక్తం చేశాడు. అయితే ఈ సూచనను  ప్రతిపక్షాలు ఇప్పటివరకూ ఆమోదించలేదు.  మొదట పిల్లలతో వచ్చే శరణార్థులకు పూర్తి భద్రత కల్పించాలని, తల్లులను, వారి పిల్లలను వేరు చేయరాదని వారు కోరుతున్నారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *