నటీనటుల మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉంటుందని, తామంతా కలసికట్టుగా ఉండేలా ఓ సందేశం ఇవ్వడానికి ఇలాంటి వేడుకలు దోహదపడతాయన్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘టీఎస్‌ఆర్‌-టీవీ9’ జాతీయ అవార్డు’ల ఫంక్షన్ కార్యక్రమం ఆదివారం రాత్రి విశాఖలో జరిగింది. 2017, 2018 సంవత్సరాలకు పలు విభాగాల్లో పురస్కారాలను అందజేశారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌బాబులకు ఆయన చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.

2017 ఏడాదికి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో నటనకుగాను ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ మన సైనికులు దేశం కోసం సరిహద్దుల్లో ఉగ్రదాడికి బలైపోయారు. ఆ దుశ్చర్యని ఖండిస్తున్నానని, ఇది కళాకారుల దేశమని, కళకు చావులేదన్నారు.

2018 సంవత్సరానికి ‘దేవదాస్‌’ ఫిల్మ్‌కి ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న నాగార్జున, తనకు ఇష్టమైన మూడు చిత్రాలు రంగస్థలం, మహానటి, గౌతమిపుత్ర శాతకర్ణిలకు అవార్డులను ఇవ్వడం సంతోషంగా ఉందన్నాడు.

శ్రీదేవి స్మారక పురస్కారంతో నటి విద్యాబాలన్‌ని సత్కరించారు. ఆమె పేరు మీద అవార్డుని అందుకుంటున్నప్పుడు విద్యాబాలన్‌ కన్నీటి పర్యంతమైంది. శ్రీదేవి లేరన్న విషయం ఇంకా నమ్మడం లేదని, ఆమె మన మనసుల్లో ఎప్పటికీ ఉంటారని తెలిపింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *