పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ని గ్లోబల్ టెర్రరిస్టుగా ముద్ర వేయడానికి ఐక్యరాజ్యసమితి తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా కోరింది. ఇందుకు అతగాడు  తగినవాడని  పేర్కొంది. ఈ విషయంలో దీన్ని అడ్డుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు ఆ దేశానికి, తమకే కాక, ఉపఖండ సుస్థిరతకు, శాంతికి కూడా విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. అజహర్‌ని గ్లోబల్ టెర్రరిస్టుల  జాబితాలో చేర్చే విషయమై   ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కీలక నిర్ణయం తీసుకోబోతున్న తరుణంలో అమెరికా విదేశాంగ శాఖ ఉప ప్రతినిధి రాబర్ట్ పలాడినో ఈ మేరకు చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మసూద్ అజహర్‌ని ఉగ్రవాదిగా ముద్రవేసి నిషేధించడానికి తగినన్ని ఆధారాలు లేవంటూ చైనా ఎప్పటికప్పుడు అతడ్ని వెనకేసుకొస్తోంది. ఇండియాలో పార్లమెంటుపై దాడి, యూరీ, జమ్మూలలో సైనిక శిబిరాలపై కాల్పులు, ఇటీవలే పుల్వామా దాడితో సహా పలు కేసులు మసూద్ అజహర్‌పై ఉన్న సంగతి తెలిసిందే. భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాలు మసూద్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *