మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – టాలీవుడ్ సన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీ ‘వినయ విధేయ రామ’. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతోంది. మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ నెల 27న హైదరాబాద్‌ యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీరిలీజ్ ఫంక్షన్ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ హాజరుకానున్న సంగతి తెలిసిందే. అయితే, మరో ముఖ్య అతిధి ఈ వేడుకలో సందడి చేయబోతున్నారనేది తాజా సమాచారం. ముందస్తు ఎన్నికలకు వెళ్లి తెలంగాణలో తమకు తిరుగులేదని నిరూపించుకున్న టీఆర్ఎస్ పార్టీ కీలకనేత కేటీఆర్ ఈ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా రానున్నారని తెలుస్తోంది.

సినిమా షూటింగ్ ఒకటి రెండు సన్నివేశాలు మినహా దాదాపు పూర్తికావచ్చింది. రేపు(శుక్రవారం) ఈషా గుప్తాతో అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన పబ్ సెట్‌లో స్పెషల్ సాంగ్‌ను షూట్ చేయబోతున్నారు. ఇంటర్వెల్‌కు ముందువచ్చే యాక్షన్ ఎపిసోడ్‌ మూవీకి హైలెట్ గా నిలుస్తుందంటున్నారు. 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో బోయపాటి ఈ సీన్ చాలా గ్రాండ్ గా చిత్రీకరించాడు. ఇప్పటికే విడుదలైన మూవీ ఫస్ట్‌లుక్, టీజర్, ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ బాణీల్లో ‘‘తందానే తందానే’’ అంటూ సాగిపోయిన ఫ్యామిలీ సాంగ్‌ మూవీ మీద మరిన్ని అంచనాలను పెంచింది. భారీ అంచనాల నడుమ జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘వినయ విధేయ రామ’లో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *