తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా రాబర్ట్ వాద్రా రైట్ హ్యాండ్!

తెలంగాణ పాలిటిక్స్ మీద ఏఐసీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే టీ కాంగ్రెస్ పర్యవేక్షకుడిగా వున్న కుంతియాను మార్చి.. ఆయన స్థానంలో ‘కొత్త చేతి’ని ఎపాయింట్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. క్రిష్ణన్ శ్రీనివాసన్‌ని ఏఐసీసీ కార్యదర్శిగా నియమించి తెలంగాణ బాధ్యతల్ని అప్పగిస్తూ ఆదేశాలొచ్చేశాయి. క్రిష్ణన్ శ్రీనివాసన్ సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాకు బాగా దగ్గరి ‘మనిషి’గా పేరున్నవాడు. గతంలో రాబర్ట్ వాద్రా బిజినెస్ వ్యవహారాలు చూసే క్రిష్ణన్ నియామకంతో.. కాంగ్రెస్ అధిష్టానంలో కొత్త ‘టాక్’ మొదలైంది. పార్టీలో క్రమంగా ‘అల్లుడి’ పట్టు పెరుగుతోందన్న సంకేతాలతో పాటు.. ప్రియాంకా గాంధీ క్రియాశీలక రాజకీయాల మీద కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. రాబర్ట్ వాద్రా గత ‘ఆదాయ లెక్కల్ని’ తవ్వితీసే పనిలో పడ్డ ఐటీ శాఖ.. ఆయనకు మరో షాకిచ్చింది. 2010-11 నాటి ఐటీ రిటర్న్స్‌లో లెక్క చూపకుండా రూ. 42 కోట్లకు పైగా ఆదాయాన్ని దాచిపెట్టినట్లు తమవద్ద ఆధారాలున్నాయని, 30 రోజుల్లోగా రూ. 25 కోట్లు జరిమానా కట్టాలని నోటీసులు జారీ చేసింది. అటు.. అవినీతి కేసులతో సతమతమవుతూనే.. ఇటు పార్టీ వ్యవహారాల్లో కూడా వేలు పెడ్తున్న ‘అల్లుడి’ గిల్లుడుని సోనియా ఎలా హ్యాండిల్ చేస్తుందో మరి!