తెలంగాణ ప్రజల నాడి పట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఆరోపించారు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి. ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపు వున్నారని, అందుకే తాను కూడా టీఆర్ఎస్‌లోకి వెళ్తున్నానని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు జనం ఆకర్షితులయ్యారని, పదవుల కోసం తానెప్పుడూ పాకులాడలేదని, జనం కోసమే పార్టీ మారుతున్నట్లు తెలియజేశారు. ఇటు టీఆర్ఎస్‌లో ఒంటేరు ఎపిసోడ్‌పై ఆసక్తికరమైన వాదన వినిపిస్తోంది. సిద్ధిపేట జిల్లాలో బలమైన నాయకుడిగా పేరున్న ఒంటేరును పార్టీలోకి లాక్కోవడం వెనుక కేసీఆర్ స్పెషల్ అజెండా వున్నట్లు చెబుతున్నారు.

సిద్ధిపేట సూపర్‌స్టార్‌గా చెలామణి అవుతూ పార్టీలో నెంబర్-2 స్టేటస్ కోసం పోటీపడుతూ వార్తల్లోవున్న హరీష్‌రావును ‘సైడ్’ చేసేందుకే ఒంటేరుపై గాలం వేశారట. ఒకవేళ హరీష్‌రావు ప్రాభవాన్ని తగ్గించిన పక్షంలో పార్టీలో ఆయనకు ధీటైన రీప్లేస్‌మెంట్‌గా ఒంటేరును వాడుకోవచ్చన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. పార్టీలో ఈయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్టు కూడా తెలుస్తోంది. కానీ, ఈ వెర్షన్‌లో నిజం పాళ్లు ఎంతన్నది నిదానం మీదే తెలియాలి.

‘ఒంటేరు చేరిక’ కోసం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ సందడి మాత్రమే ఎక్కువగా కనిపించడం.. హరీష్ రావు ఊసే లేకపోవడం అనుమానాలకి తావిస్తోంది. గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై నడిపించిన హరీష్ రావు.. ఒంటేరుతో ‘వన్-టు-వన్’ తలపడ్డారు. కేసీఆర్‌ని గెలిపించడానికి చాలా రిస్క్ చేశారు. కానీ.. ఇప్పుడు అదే గజ్వేల్‌లో రాజకీయ పునరేకీకరణ జరిగి.. ఒంటేరు తెరాసలో చేరిపోవడంతో.. హరీష్ రావు పరిస్థితి ‘కుడితిలో పడ్డ ఎలక’లా మారింది. కనీసం ఈ వేదిక మీద హరీష్ రావు అప్పియరెన్స్ ఇచ్చినా.. కేసీఆర్ కుటుంబంతో ఆయనకు ‘తేడా’లు లేవన్న ఫీలర్స్ పార్టీలో కలిగేవి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *