తెలుగు పొలిటికల్ సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ ఎక్కడవరకొచ్చింది..? పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు సందడి కనిపించినా.. బ్యాక్ ఎండ్‌లో జరగాల్సిన బిజినెస్ మాత్రం.. బ్యాక్ ఎండ్‌లోనే ఉండిపోయిందా..? శాటిలైట్ రైట్స్ 3 కోట్లకు అమ్ముడయ్యాయని, థియేట్రికల్ రైట్స్ మీద అన్ని ఏరియాలూ కలిపి 12 కోట్ల దాకా వసూలయ్యాయని వార్తలు ఊపందుకుంటున్న నేపథ్యంలో.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘బాంబు’ పేల్చేశారు. ”మా సినిమాను ఎవ్వరూ కొనుక్కోలేదు. పిచ్చిపిచ్చి వార్తలు నమ్మకండి.. ఇప్పటికీ దుకాణం తెరిచే వున్నది” అంటూ వర్మ చేసిన ట్వీట్ ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ బిజినెస్ బండారాన్ని బయటపెట్టేసింది.

ఇప్పటికే బాలయ్య-క్రిష్ కాంబోలో వచ్చిన ‘ఎన్టీయార్’ బయోపిక్స్ రెండు భాగాలూ ఢమేల్ మంటూ కుప్పకూలిపోవడంతో డిస్ట్రిబ్యూటర్ల కర్చీఫులు తడిసిపోయాయి. వాళ్లందరినీ ఎలా సర్దాలో తోచక బాలయ్య కూడా తంటాలు పడుతున్నారు. అటు.. వైఎస్ ‘యాత్ర’ కూడా తిరగబడ్డట్టే వుంది. మొదట్లో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ లాంగ్ రన్‌లో ‘యాత్ర’ నిలదొక్కుకోలేకపోయిందట. ఖర్చు పెట్టిన సొమ్ములో సగభాగం కూడా రాలేదని టాక్. కాకపొతే.. ‘యాత్ర’కు పొలిటికల్ ఫైనాన్సర్ల భరోసా వుంది. ఈ క్రమంలో తెలుగు బయోపిక్‌లకు, రాజకీయ నేపథ్యమున్న సినిమాలకు ఆదరణ తగ్గుతోందన్న భావన స్థిరపడిపోయింది. ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ భవిష్యత్తూ అంతేనని వర్మ ట్వీట్ ద్వారా తేలిపోయింది.

‘కొనుగోలుదారులు కావలెను’ అంటూ ఫోన్ నంబర్‌తో సహా వర్మ వేసిన దండోరా.. తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ఒరవడి. గతంలో.. మరీ చిన్నతరహా చిత్రాలకు మాత్రమే ఈ తరహా బిజినెస్ టెక్నిక్ వాడేవారు. మరి.. ‘వర్మాస్ ఎన్టీయార్’ సినిమా బాక్సాఫీసు దాకా నడుస్తుందో లేక.. ఆ లోపలే చతికిల పడుతుందో.. చూడాలి! గతంలో వర్మ తీసిన కొన్ని ప్రాజెక్టులు యుట్యూబ్‌లో విడుదలై.. ఇప్పటికింతే అంటూ సర్దుకున్నాయి కూడా!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *