సినిమా పేరు : ‘F2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)
విడుదల తేదీ : 12. 01. 2019
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌
దర్శకత్వం : అనిల్‌ రావిపూడి
నిర్మాత : దిల్‌ రాజు (శిరీష్‌, ల‌క్ష్మణ్‌)
నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్‌,రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌కాష్ రాజ్‌, ఝాన్నీ, వెన్నెల‌కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, అన‌సూయ‌, ర‌ఘు బాబు, నాజర్, పృథ్వి, వై.విజ‌య‌, అన్న‌పూర్ణ‌మ్మ త‌దిత‌రులు

యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ గా నిరూపించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). సంక్రాంతి అంటే కుటుంబం అంతా ఒక‌చోట చేరి జ‌రుపుకునే పండుగ కావడంతో పండుగరోజుల్లో వ‌చ్చే కుటుంబ క‌థా చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ లభించడం పరిపాటి. అదే ఆలోచ‌న‌తో నిర్మాత దిల్‌రాజు, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఎఫ్-2 అనే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ ను సంక్రాంతికి తీసుకొచ్చారు. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ సరికొత్త కాంబినేష‌న్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ సినిమాలు చేయ‌డం వెంక‌టేష్‌కు కొత్తకాకపోయినా.. యంగ్ హీరో వ‌రుణ్ తేజ్ కూడా పూర్తిస్థాయిలో కామెడీ ట‌చ్ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. ఇక, అనిల్ రావిపూడి ఫ‌న్ ఏంటి ? ఫ‌్రస్టేష‌న్ ఏంటో ఓ లుక్కేద్దాం..

స్టోరీ : వెంకీ (వెంకటేష్‌) ఎమ్మెల్యే (రఘు బాబు) దగ్గర పీఏగా పనిచేస్తుంటాడు. ముందూ వెనుకా ఎవరూ లేని వెంకీకి హారిక (తమన్నా) తో పెళ్లి జరుగుతుంది. అలాగే బోర‌బండ‌కు చెందిన వ‌రుణ్ యాద‌వ్‌(వ‌రుణ్‌తేజ్‌)కు హారిక చెల్లెలు హ‌నీ(మెహ‌రీన్‌)తో నిశ్చితార్థం అవుతుంది. పెళ్లంటే ఎంతో ఆనందంగా జరుపుకున్న వెంకీకి పెళ్లితర్వాత భార్య‌, ఆమె త‌ల్లి చేసే చేష్టలకు ఫ్రస్టేష‌న్ పెరిగిపోతుంటుంది. ఈ సమయంలో వ‌రుణ్‌ను క‌లిసిన  వెంకీ పెళ్లి చేసుకోవ‌ద్దని స‌ల‌హా ఇస్తాడు. గతంలో వెంకీ ఎలాంటి మోజులో ఉండి పెళ్లికానిచ్చుకున్నాడో అంతే జోష్ మీదున్న వ‌రుణ్.. వెంకీ మాటల్ని కొట్టిపారేస్తాడు. ఈ క్రమంలో ఇరుగుపొరుగు వ్యక్తి(రాజేంద్రప్రసాద్‌) చెప్పిన మాటలు విని వెంకీ తన భార్యను, వరుణ్‌ తనకు కాబోయే భార్యను వదిలేసి యూరప్‌ వెళ్లిపోతారు. తాము దూరమైతే భార్యలు కాళ్ల బేరానికి వస్తారన్న ఆశతో ప్లాన్ చేసుకున్న వెంకీ వరుణ్ ల ప్లాన్ రివర్స్ అయి.. హారిక, హనీలు యూరప్‌లోనే ఉండే దొరస్వామి నాయుడు కొడుకులను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైపోతారు. ఇలా అడ్డం తిరిగిన కథ ఎలా సాఫీగా మారుతుందన్నదే ఫన్ అండ్ ఫస్ట్రేషన్ సినిమా.

విశ్లేషణ : పండుగపూట పూర్తిస్థాయి కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ తీసుకురావడంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి సక్సెస్ సాధించాడు. లోతైన కథ లేకపోయినా కట్టిపడేసే అనేక సన్నివేశాలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించగలిగాడు డైరెక్టర్. ప్రతీ ఇంట్లో రెగ్యులర్‌గా జరిగే విషయాలనుంచే సాధ్యమైనంత కామెడీ పిండాడు. భార్య భర్తల మధ్య జరిగే గొడవలు, వాటి పరిణామాలు, ఈ క్రమంలో పేలే డైలాగ్స్‌ బావున్నాయి. అయితే, ఫస్ట్ హాఫ్ లో వందకు వంద మార్కులు కొట్టేసిన డైరెక్టర్ సెకండాఫ్ లో కాస్త రిలాక్స్ అయినట్టు కనిపించింది. ఇక వెంకీ చాలా కాలం తరువాత తనదైన కామెడీ టైమింగ్‌తో రెచ్చిపోయాడు. సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు. అటు, మరో హీరో వరుణ్ తేజ్‌ కు కూడా ఈ సినిమా కొత్త యాంగిల్ టచ్ చేసేలా చేసింది. నటన పరంగా.. తెలంగాణ యాసలోనూ ఆకట్టుకున్నాడు.

హారిక పాత్రలో తమన్నా చాలా రోజుల తరువాత లీడ్ హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుని సిక్సర్ కొట్టింది. మరో హీరోయిన్‌మెహరీన్‌ నటన కాస్త అతిగా అనిపించినా ఆమె పాత్రకు తగ్గట్టుగానే నటించి మెప్పించింది. గ్లామర్‌ షోలో మాత్రం ఇద్దరు హీరోయిన్లు సంక్రాంతి పండుగ తెరమీద చూపించారు. రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, ప్రగతి, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌లు తమ వంతు కామెడీతో ఆకట్టుకున్నారు. క్లైమాక్స్‌లో నాజర్‌ ఎంట్రీ, ఆయన డైలాగ్స్‌ ఆలోచింపచేస్తాయి. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫి రిచ్ లుక్ ఇస్తే, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమాని విజయతీరాలకు చేర్చడంలో పూర్తిగా సహకరించాయి. ఈ సంక్రాంతికి విడుద‌లైన భారీ సినిమాల పోటీని న‌వ్వుతూ తట్టుకునే సినిమా ఎఫ్2.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *