సంక్రాంతి సందర్భంగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు రామ్‌చరణ్. ఆయన నటించిన ‘వినయ విధేయ రామ’ శుక్రవారం రిలీజైంది. ధృవ, రంగస్థలం సినిమాలు వరసగా హిట్ కావడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. దీనికితోడు చెర్రీతో బోయపాటి శ్రీను తొలిసారి చేస్తున్న ఫిల్మ్ కావడంతో మాంచి హైప్ వచ్చింది. ఈ క్రమంలో చెర్రీ- బోయపాటి కాంబినేషన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్దాం.

స్టోరీ

రైలు పట్టాల వద్ద నలుగురు పిల్లలకు ఓ బాబు దొరుకుతాడు. పెరిగి పెద్దవాడయ్యాక రామ్(రామ్ చరణ్)‌గా మారుతాడు. ఆ నలుగురూ రామ్‌కి అన్నయ్యలుగా (ప్రశాంత్‌, ఆర్యన్ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌) వుంటారు. ఫ్యామిలీలో రామ్ అంటే అంద‌రికీ ఇష్టం. పెద్దన్న (ప్రశాంత్‌) విశాఖ ఎలక్షన్ కమిషనర్‌గా ప‌ని చేస్తుంటాడు. అక్కడ జ‌రిగే బైపోల్‌లో పరశురాం(ముఖేష్ రుషి) అరాచ‌కాల‌ను బ‌య‌టపెడ‌తాడు.

దీంతో ఇద్దరి మ‌ధ్య గొడ‌వ పెరిగి చివరకు రామ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు పరశురామ్. అందుకు బీహార్‌లోవున్న మున్నాభాయ్‌(వివేక్ ఒబెరాయ్‌)‌ని రంగంలోకి దింపుతాడు. మున్నాభాయ్ వ‌ల్ల రామ్ ఫ్యామిలీకి జరిగిన న‌ష్టమేంటి? అన్యాయాన్ని రామ్ ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే!

విశ్లేషణ

బోయపాటి అంటే మాస్ చిత్రాలకు కేరాఫ్‌గా చెబుతారు. పాత స్టోరీలకు కాసింత పొలిటికల్ టచ్ ఇచ్చి బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టిన సందర్భాలు అనేకం. ‘వీవీఆర్’ దగ్గరకు వచ్చేసరికి గ‌తంలో బోయపాటి చేసిన చిత్రాల‌ను కలిపి చూపించినట్టుగా వుంది. ఓ వైపు పూర్తి ఎంట‌ర్‌టైనర్‌గా సాగితే.. మరోవైపు అన్న కుటుంబానికి జ‌రిగిన అన్యాయంపై ఓ త‌మ్ముడు చేసే పోరాటంగా కనిపిస్తుంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేయ‌డంలో బోయ‌పాటి త‌న మార్కుని చూపించాడు. చెర్రీ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. ఫ్యామిలీ, ల‌వ్‌, ఫ‌న్‌, ఫైట‌ర్ ఇలా అనేక కోణాల్లో సాగుతుంది. అన్నింటిక‌న్నా ఫైట‌ర్‌గా మాత్రమే ఎలివేట్ అయ్యాడు. సిక్స్‌ప్యాక్‌లో యాక్షన్ సీన్స్ అభిమానుల‌కు బాగా న‌చ్చుతాయి. ఇక కైరా అద్వానీ గ్లామర్ కోసమే వుంది. ఆమె పాత్రకు అంత‌గా ప్రయారిటీ ఇవ్వలేదు. అన్నద‌మ్ములుగా ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మలు తమ పాత్రల్లో పర్వాలేదనిపించారు. ప్రశాంత్‌కు ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి.

విలన్‌గా వివేక్ ఒబెరాయ్ త‌న‌దైన శైలిలో ఆకట్టుకున్నాడు. రామ్‌-వివేక్ పోరాట స‌న్నివేశాలు బాగున్నాయి. ఇంటర్వెల్ వరకు సినిమాని మెల్లగా నడిపించాడు. ఆ తర్వాత స్టోరీ లేకపోవడంతో యాక్షన్‌తో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు బోయపాటి. ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి యాక్షన్ ఎపిసోడ్లు రావడంతో సగటు ప్రేక్షకుడు అయోమయంలో పడ్డాడు. సెకండాఫ్ అంతా హింస‌, హీరోయిజంతోనే సాగుతుంది. డైలాగ్స్, డ్యాన్సులు ఇరగదీశాడు చెర్రీ.

ప్రతీ ఫ్రేమ్‌లోనూ ప‌ది, ప‌దిహేను మంది క‌న‌ప‌డ‌డంతో హిందీ సినిమా చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. సినిమాటోగ్రఫీ హైలైట్. ఒకటి రెండు తప్పితే మిగతా పాటలు అంతగా ఆకట్టుకోలేదు. కొన్ని సన్నివేశాలకు అక్కడక్కడ కత్తెరలు పడితే బాగుండేది. దేవిశ్రీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఏ సెంటర్ల కన్నా బీ,సీ కేంద్రాల్లో వీవీఆర్ ఆడేయవచ్చు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *