బాబా వీరేంద్ర సెహ్వాగ్.. పీఛే క్యా హై..?

డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి రాజకీయాల్లో వేలు పెట్టేశాడు. కాషాయ దుస్తులేసుకుని, కమండలం పట్టుకుని, మెళ్ళో రుద్రాక్షలతో ప్రత్యక్షమై ‘నేనంటే నేనే’ అనేశాడు. ఫన్నీ ఎలిమెంట్‌గా ఎక్స్‌పోజ్ అవుతూ సదరు ఫోటోను ట్విట్టర్లో పెట్టేశాడు. అకస్మాత్తుగా వీరూకు ఈ ‘కాషాయం’ రంగు ఎందుకు పట్టుకుంది? అంటూ మొదలైన చర్చ.. దేశ రాజకీయాల దాకా పాకేసింది. ‘సెహ్వాగ్ బీజేపీలో చేరనున్నారా?’ అనే టాక్ అప్పటినుంచే వేడెక్కింది.

ఒక్కసారి 6 నెలల వెనక్కి వెళితే వీరూకి సంబంధించి ఒక ఫ్లాష్‌బ్యాక్ కనిపిస్తుంది. కేరళలో ఆకలిగొన్న ఒక దళితుడ్ని రోడ్డుమీదే కొట్టి చంపిన జనం గురించి ఆవేశంగా ఆయనో ట్వీట్ చేశారు. ఈ దాష్టీకానికి పాల్పడ్డానికి వీళ్లకు మనసెలా వచ్చింది అంటూ ఆ గుంపులోని నలుగురు ముస్లింల పేర్లు ప్రస్తావించాడు. అంతమంది జనంలో ఆ నలుగురు ముస్లిం మతస్తులే నీకు కనిపించారా? అంటూ సెహ్వాగ్ మీద సోషల్ మీడియాలో తాకిడి షురూ అయ్యింది. ఆ గొడవ మరింత చెలరేగక ముందే ఒక సారీ చెప్పి తప్పించుకున్నాడు వీరూ.

ఢిల్లీ యువకెరటం వీరేంద్ర సెహ్వాగ్కీ, బీజేపీకి వున్న బంధం ఇప్పటిదైతే కాదు. 2014 ఎన్నికల్లో బీజేపీ నేత సాహిబ్ సింగ్ వర్మ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అంతకుముందు సెహ్వాగ్ పెళ్లి కోసం అధికారిక బంగళా కేటాయించారు మరో బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా వున్నప్పుడే అరుణ్ జైట్లీకీ వీరూకీ మధ్య ‘కమలం మార్క్ కెమిస్ట్రీ’ కలిసిందట! 2019 ఎన్నికల్లో సెహ్వాగ్‌ని పార్లమెంట్‌కు పంపించే ఆలోచన కూడా ఉందట బీజేపీకి. అందులో భాగమేనా.. ఈ శాఫ్రాన్ డ్రెస్ కోడ్?!