ఇంటర్నెట్ విస్తృతి ఊహకందనంత వేగం అందుకుంటోంది. ప్రతి నిత్యం, ప్రతి కృత్యం ఇంటర్నెట్ ఆధారంగానే సాగుతోందిప్పుడు. భవిష్యత్తులో మనిషికి-ఇంటర్నెట్‌కి మధ్య నెలకొనే అనుబంధం విడదీయరానంత గట్టిగా వుండబోతోంది. ఈ క్రమంలోనే.. ఇంటర్నెట్‌ని ‘సేఫ్ అండ్ సెక్యూర్డ్’గా.. మరింత సురక్షిత అంశంగా మార్చేందుకు ప్రపంచవ్యాప్తంగా కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా బ్రిటన్కి చెందిన ఒక ఇంటర్నేషనల్ వాచ్ డాగ్.. విచిత్రమైన మార్గదర్శకాల్ని ప్రతిపాదిస్తోంది.

యూజర్ల మధ్య ఏజ్ బారియర్ (వయోసరిహద్దుల్ని) నిర్మించడం ద్వారా.. ఇంటర్నెట్ దురుపయోగాన్ని అరికట్టవచ్చన్నది ఇన్ఫర్మేషన్ కమిషనర్ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం.. ప్రతిసారీ.. విజిట్ చేసే ప్రతి వెబ్‌సైట్‌లోనూ మొదట్లో వారివారి వయసుల్ని చెప్పాల్సి వుంటుందట. మీమీ వయసుల్ని బట్టి సదరు వెబ్‌సైట్‌ని మీరు బ్రౌజ్ చేయవచ్చా చేయకూడదా అనేది నిర్ధారితమవుతుంది. ఇదొక పిచ్చి పధ్ధతి అంటూ ఇప్పుడే విమర్శలు పడిపోతున్నాయి. తుగ్లక్ తరహా కోడ్‌తో ఇంటర్నెట్ యూజర్ల సమాజాన్ని భ్రష్టు పట్టించవద్దని కోరుతున్నారు.

ఒక ఆన్లైన్ షాపింగ్ సైట్‌ని లేదా.. ఒక హాలిడే ట్రిప్ వెబ్‌సైట్‌ని, ఒక కమర్షియల్ న్యూస్ వెబ్‌సైట్‌ని.. ఇలా అనేక రకాల డొమైన్స్‌ని యూజర్లు తమతమ అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా విజిట్ చేయాలనుకుంటారు. అటువంటప్పుడు ప్రతి బ్రౌజింగ్ సెషన్లోనూ వయసును చెప్పి కొత్తగా లాగిన్ కావడం అనేది ప్రాక్టికల్‌గా కుదిరేది కాదని క్రిటిక్స్ వాదిస్తున్నారు. చిన్నపిల్లల చేష్టలాంటి ఈ నిబంధనతో ముఖ్యంగా ఆన్లైన్ అడ్వర్టయిజ్‌మెంట్ బిజినెస్ పడిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్ యొక్క ‘ఫ్రీ వెబ్ సర్వీసెస్’ అనే మూల ఉద్దేశమే దెబ్బ తింటుందని, Mumsnet, TripAdvisor లాంటి చాట్ ఫోరమ్స్ మూసుకుపోవడం ఖాయమని చెబుతున్నారు.

తాజా కోడ్‌ని అమలు చేయకుండా ఉల్లంఘించే కంపెనీలపై.. టర్నోవర్‌లో 4 శాతం వరకూ భారీ జరిమానాలు కూడా విధిస్తారట. ఈ లెక్కన.. ఈ ఏజ్ నిబంధనను ఉల్లంఘిస్తే ఫేస్‌బుక్ 167 కోట్ల యూరోలు ఫైన్ కట్టాల్సిందే. పసిపిల్లల్ని చెడు కంటెంట్ నుంచి కాపాడ్డం కోసం  ఇటువంటి రాడికల్ ప్రపోజల్స్ పెట్టక తప్పదన్నది ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎలిజబెత్ డెనమ్ కమిట్మెంట్. చూడాలి.. ఈ కోడ్ అమలుదాకా వస్తుందో లేక.. మధ్యలోనే ఆగిపోతుందో..! ఇప్పటికి బ్రిటన్లో పుట్టిన ఈ పుండు ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందా అనేది కూడా అనుమానమే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *