బయోపిక్‌ల తాకిడి కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతోంది. పెద్ద పండక్కి బైటికొచ్చిన ఎన్టీయార్ కథానాయకుడి కథ ఆ పండగ నెల ముగిసేలోగానే ముగిసిపోయింది. టేకింగ్‌లో పటుత్వం ఉందని, ఎమోషన్స్ పండించడంలో క్రిష్ మార్క్ కనబడిందని.. ఇలా కొన్ని కారణాలు తప్ప సినిమా గురించి గొప్పగా చెప్పుకోడానికేమీ మిగల్లేదు. వసూళ్ల పరంగా కూడా ఉస్సూరుమనిపించింది. బయోపిక్‌లకు కాలం చెల్లిందా అనే అనుమానాల నడుమ ఈనెల 8న మరో పొలిటికల్ బయోపిక్ బైటికొచ్చింది.

మహి వీ రాఘవ్ డైరెక్షన్లో ‘యాత్ర’ పేరుతో అట్టహాసంగా రిలీజైన వైఎస్ బయోపిక్ టాక్ మీద ఈ వీకెండ్‌లో ఆసక్తి నెలకొంది. వైసీపీ మీడియా చెబుతున్నట్లు ‘బ్లాక్ బస్టర్’ కాదన్న విషయం మాత్రం.. తొలిరోజు వసూళ్లను బట్టి తేలిపోయింది. మమ్ముట్టి సొంతగడ్డ కేరళలోనే ఏడున్నర లక్షల గ్రాస్ తీసుకుందట! ఒక్క నైజాం మినహా మరెక్కడా అరకోటి మార్క్ దాటలేదు. మిగతా ఏరియాల్లో పది-పాతిక లక్షలకు మధ్య మాత్రమే కలెక్షన్లు దండుకున్న ‘యాత్ర’.. కంటెంట్ పరంగా బలహీనంగా ఉన్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. పెట్టుబడి కూడా గిట్టుబాటు కాబోదని తేలిపోయింది. ఈ సంక్షోభ సమయంలోనే ఎన్టీయార్ ‘మహానాయకుడు’ విడుదల మీద అనుమానాలు మొలకెత్తేశాయి. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ రిలీజ్ డేట్ మీద ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాడు బాలయ్య.

హైదరాబాద్ సారధీ స్టూడియోస్‌లో తీసిన కొన్ని సీన్స్‌తో.. షూటింగ్ పార్ట్ మాత్రం పూర్తయింది. రిపేర్ల మీద రిపేర్లు చేసుకుని ఎట్టకేలకు మేకింగ్‌ని ముగించిన క్రిష్.. ఇప్పుడు రీరికార్డింగ్ మీద పడ్డారు. ‘మహానాయకుడు’ అవుట్‌ఫుట్ మీద బాలయ్య కూడా సంతృప్తితో లేరని యూనిట్ నుంచి ఫీలర్స్ వస్తున్నాయి. ఎలావున్నా.. సినిమానైతే జనంలోకి తీసుకురాక తప్పదు కనుక.. మార్చి 1న విడుదల చేయాలని సంకల్పించినట్లు తెలుస్తోంది. ఆవిధంగా ‘నాన్నగారి’ బయోపిక్ తియ్యాలన్న జీవితాశయాన్ని బాలయ్య పూర్తి చేసుకోబోతున్నారు. ఇది డబ్బు కోసం తీస్తున్న ప్రాజెక్టు కాదని, ఎన్టీయార్ కీర్తి మరికొన్ని తరాల పాటు నిలబడాలన్న ఉద్దేశంతో తీసిందని బాలయ్య ముందే ‘సరెండర్’ అయ్యారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *