ఏపీలో సినీ, రాజకీయ రంగాలకు ఉమ్మడి బంధువు పొట్లూరి వరప్రసాద్. ఐదారేళ్లుగా డైరెక్ట్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆయన కల ఇప్పటికి నెరవేరింది. పవన్ కళ్యాణ్‌కి ఆప్తమిత్రుడిగా వున్న సమయంలో 2014లోనే టీడీపీ తరపున ఎంపీ సీటు కోసం లాబీయింగ్ చేసి ఫెయిల్ అయ్యారు. అతడి ‘బెజవాడ ఎంపీ సీటు’ను నాటకీయ పరిణామాల మధ్య కేశినేని నాని తన్నుకుపోయారు. ఇప్పుడు మరో ట్రయల్ వేసి.. జగన్ చలవతో బెజవాడ నడిబొడ్డున నిలబడ్డాడు.

కేశినేని నాని వర్సెస్ పొట్లూరి వరప్రసాద్..! ఇద్దరూ వ్యాపార దిగ్గజాలే. మంచి సౌండ్ వున్న శాల్తీలే. రెండు ప్రధాన పార్టీలూ ఏరికోరి వీరిద్దరినీ నిలబెట్టేశాయి. ఈ ఫైట్ మామూలుగా ఉండదన్న అంచనా ఇప్పుడే బెజవాడను వేడెక్కిస్తోంది. ‘ఓటు రేటు’ కూడా అమాంతం పెరిగింది.. అది వేరే విషయం..! కానీ.. పీవీపీని నైతికంగా కుంగదీసి.. పైచేయి సాధించాలన్న కసితో వున్న కేశినేని నానికి.. ఎట్టకేలకు ఒక ఆయుధం దొరికింది.

‘స్పెషల్ స్టేటస్ ఒక బోరింగ్ సబ్జెక్ట్.. దాని గురించి మాట్లాడి విసుగు పుట్టించను’ అంటూ పారిశ్రామికవేత్తల మండలి (సీఐఐ) మీటింగ్‌లో పీవీపీ యధాలాపంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ గ్యాప్‌లోనే కేశినేని నాని మేలుకున్నారు. ”జగన్, పీవీపీ ఇద్దరిదీ ఒకటే మాట. ఏపీ యువతకు జీవనాడి అనుకుంటున్న స్పెషల్ స్టేటస్ బోరింగ్ సబ్జెక్టట” అంటూ విమర్శలందుకున్నారు. కేశినేనితో పాటు లోకేష్, చంద్రబాబు కూడా ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. పీవీపీని శిక్షించాలని, బెజవాడ అభ్యర్థిని మార్చాలని డిమాండ్లు వచ్చేసిన క్రమంలో వైసీపీ కూడా రియాక్ట్ అయింది.

తన మాటల్ని వక్రీకరించారని, పూర్తి ప్రసంగం వింటే తానేమన్నానో అర్థం అవుతుందని పీవీపీ నెత్తీనోరూ బాదేసుకుంటున్నారు. కానీ. పీవీపీ చెప్పినదాంట్లో తప్పేముంది అనే వెర్షన్ కూడా బలపడుతోంది. ఆయా రాజకీయ పార్టీలు తప్పించుకోవచ్చు గాని.. స్పెషల్ స్టేటస్ అనేది ప్రస్తుతానికి నిజంగానే బోరింగ్ సబ్జెక్ట్. ఏడాది కిందటివరకు వైసీపీ, అడపాదడపా జనసేన, కామ్రేడ్లు, కాంగ్రెస్ పార్టీలు గగ్గోలు పెట్టి అలసిపోయాను. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ ‘స్పెషల్ స్టేటస్’ని అడ్డుపెట్టుకుని బీజేపీ మీద బూతుల దండకం విప్పింది.

గత నెలలో బైటికొచ్చిన డేటా చోరీ అంశం.. ఆ తర్వాత జరిగిన ఆకస్మిక పరిణామం వివేకా హత్య.. లాంటి ఘటనలన్నీ ఎన్నికల్లో ప్రచార అంశాలుగా మారిపోయాయి. నోటిఫికేషన్ విడుదలైన మొదటి వారం రోజులూ వివేకా హత్య కేసు మీదనే రాజకీయం నడిచింది. ఇక.. మిగిలిందల్లా మహా అయితే రెండు వారాలు..! ఈ చిన్న గ్యాప్‌లో స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడినా ఏ పార్టీకీ ప్రయోజనం ఒనగూడే పరిస్థితులు లేవు. పవర్లోకొస్తే స్పెషల్ స్టేటస్ మీదే తొలి సంతకం చేస్తానన్న రాహుల్ గాంధీకి, ఆయన పార్టీకీ ఏపీలో కష్టపడాల్సిన అవసరాలే లేవు. బీజేపీ ఇవ్వదు.. ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీకి అధికారం రాదు..!

ప్రత్యేక తరగతి హోదా వస్తే ఏపీ ప్రజలకు ప్రయోజనాలు ఉంటే ఉండవచ్చు.. కానీ.. ఆ స్టేటస్ వస్తుందన్న భరోసాలైతే ఏ ఒక్కరికీ లేవు. రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోడానికే తప్ప ‘స్టేటస్’ అనేది ముగిసిపోయిన అధ్యాయమన్న బీజేపీ మాటలోనే ఎంతోకొంత చిత్తశుద్ధి కనిపిస్తుంది. అందుకే.. స్పెషల్ స్టేటస్ అనేది.. ఖచ్చితంగా పుచ్చిపోయిన సబ్జెక్టేనని ఏపీ జనం కూడా ఫిక్స్ అయ్యారు. పీవీపీ చెప్పినా.. ఏ వీపీ చెప్పినా.. స్పెషల్ స్టేటస్‌కి అంత ‘సీన్’ ఇవ్వాల్సిన అవసరం లేదన్నది వాస్తవం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *