కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టిన అగస్టా వెస్ట్ ల్యాండ్ వ్యవహారంలో మధ్యవర్తి (దళారీ) పాత్ర వహించిన ‘ మిషెల్ మామ ‘ తో మీకున్న సంబంధమేమిటని ప్రధాని మోదీ ఆ పార్టీని ప్రశ్నించారు. రఫెల్ విమానాల కొనుగోలులో మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అదేపనిగా ఆరోపణలు చేస్తుండడంతో దీనికి మోదీ కౌంటరిచ్చారు. ఈ విమానాల డీల్ కోసం పోటీ పడిన యూరో ఫైటర్ తరఫున క్రిస్టియన్ మిషెల్ లాబీ చేశాడని ఇటీవల వచ్చిన వార్తల నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్ర లోని షోలాపూర్ లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న మోదీ.. ఏదో మరో సంస్థ తరఫున ఈ ‘ మామ ‘ లాబీ చేస్తూ వచ్చాడని, అయితే రఫెల్ ఒప్పందంపై గొంతులు చించుకుంటున్న మీకు (కాంగ్రెస్ నాయకులకు), ఇతనికి మధ్య ఉన్నలింకులేమిటో చెప్పాలని అన్నారు. ఈ ‘ చౌకీదార్ ‘ అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారా అని నిలదీశారు. కమీషన్లు (ముడుపులు) పుచ్చుకుంటున్న ఈ నేతలంతా ఈ చౌకీదార్ ని భయపెట్టాలని చూస్తున్నారని, అయితే వారి ప్రయత్నాలు ఫలించవని ఆయన పేర్కొన్నారు. ‘ ఈ కాపలాదారు నిద్ర పోడు..భయపడబోడు కూడా..నా మీద మీరెంతో బురద జల్లవచ్చు.. కానీ ‘ సఫాయీ ‘ (శుద్ది కార్యక్రమం) కొనసాగుతుంది..అది ఆగబోదు ..” అని ఆయన వ్యాఖ్యానించారు.

వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఆర్ధిక ప్రయోజనం చేకూర్చేందుకే మోదీ ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి ఎక్కువ ధరకు రఫెల్ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుందని రాహుల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అటు-అగస్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కేసులో అరెస్టయిన క్రిస్టియన్ మిషెల్‌ను ఢిల్లీ కోర్టు మూడు రోజుల క్రితం జుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. ఈ కేసులో ఈయన 24.25 మిలియన్ యూరోలను, 16.1 మిలియన్ పౌండ్లను ముడుపులుగా స్వీకరించడమే గాక, ఇతర డీల్స్ ద్వారా కూడా పెద్ద మొత్తంలో డబ్బులు నొక్కేశాడని ఈడీ ఆరోపించింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *