150 కోట్ల యూజర్ల సైజున్న పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. కానీ.. తమ యాప్ దుర్వినియోగం కాకుండా చూసుకునే స్వయంరక్షణ విషయంలో మాత్రం బోల్తా పడుతూనే వుంది. ప్రతినెలా దాదాపు 20 లక్షల వరకు స్పామ్ అకౌంట్స్ ని డిలీట్ చేసుకుంటూ పోతున్నప్పటికీ.. నకిలీల బెడద తప్పడం లేదు. ఫేక్ న్యూస్  నుంచి బైటపడ్డానికి వాట్సాప్ యంత్రాంగం నానా యాతనా పడుతోంది. ఇండియాలో సార్వత్రిక ఎన్నికల సమయం కూడా ముంచుకొచ్చెయ్యడంతో.. నకిలీ వార్తల కట్టడికి చర్యలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగానే లేటెస్ట్ అప్డేట్ వెర్షన్‌లో ఒక కీలక ఫీచర్‌ని అదనంగా తీసుకొచ్చింది మెసేజింగ్ సర్వీస్ యాప్ ‘వాట్సాప్’. ‘సెర్చ్ బై ఇమేజ్’ పేరుతో ఈ టూల్ త్వరలో వినియోగంలోకి రానున్నట్లు WABetaInfo అనే సైబర్ రీసెర్చ్ సంస్థ రిపోర్ట్ చేసింది.

2.19.73 వెర్షన్ రిలీజ్ నోట్స్‌లో కనిపించిన ఈ తాజా ఫీచర్ మీద అప్పుడే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తనకు ఫార్వర్డ్ అయిన ఏదైనా ఇమేజ్ ఒరిజినల్ అవునా కాదా తేల్చడానికి యాప్‌లోని search by image అనే ఆప్షన్ ద్వారా ప్రయత్నించవచ్చట. సదరు ఇమేజ్ గూగుల్ సెర్చింజన్‌లో పేస్ట్ చేయడం ద్వారా.. దాని సచ్చీలత ఎంతో తేలిపోతుంది. ఫోటోషాప్ ద్వారా మానిప్యులేట్ చేసిన ఇమేజ్ అయితే.. దాని బాగోతం అప్పటికప్పుడే తెలిసిపోతుంది. తద్వారా దాన్ని మన గ్రూప్ సభ్యులకు పంపాలా వద్దా అనేది నిర్ణయించుకునే విచక్షణ కూడా కలుగుతుంది. ఇప్పటిది కేవలం ప్రయోగ దశలో వుంది గనుక ఎప్పటినుంచి యూజర్లకు అందుబాటులోకి వస్తుందో చెప్పడం కష్టం.

నకిలీ సందేశాలకు చెక్ చెప్పడం కోసం గతంలోనే అనేక చర్యలు తీసుకుంది వాట్సాప్ సంస్థ. 20 మందికి పంపగలిగే మెసేజ్ ని కేవలం 5 మందికి మాత్రమే పరిమితం చేసింది. ఉద్దేశపూర్వకంగా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయాలన్నవారికి అక్కడితో కొంత మేర చెక్ పడింది. పైగా.. ఫార్వర్డ్ అయిన మెసేజ్ అయితే.. అది సెండర్ సొంతం కాదని చెప్పే ఒక సింబల్‌ని కూడా మెసేజ్‌తో పాటు పోస్ట్ అయ్యేలా చేసింది వాట్సాప్. ఇప్పుడు.. ఫార్వర్డెడ్ మెసేజ్ రంగు-రుచి-వాసన కూడా పసిగట్టే ‘సెర్చ్ బై ఇమేజ్’ టూల్‌ని పరిచయం చేస్తోంది. ఈ విధంగా మరిన్ని మంచి పనులు చేస్తే.. నకిలీల బెడద తప్పిపోయి వాట్సాప్ ఒక కడిగిన ముత్యంలా కనిపించే అవకాశం వున్నట్లే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *