ఇండియాలో క్షయ వ్యాధి (టీబీ) ని పూర్తిగా నిర్మూలించాలన్న మోదీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపించడంలేదు. 2025 నాటికల్లా ఈ ధ్యేయాన్ని సాధిస్తామని మోదీ గత ఏడాది ప్రకటించారు. కానీ..2025 కాదు కదా..మరో ఐదేళ్ళయినా.అంటే..2030 నాటికైనా ఇది సాధ్యపడుతుందా అన్నది సందేహాస్పదమే. ప్రపంచ దేశాల్లో ఈ వ్యాధి నిర్మూలన త్వరిత గతిన జరగాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు పిలుపునిచ్చాయి. గత ఏడాది సెప్టెంబరు 26‌న న్యూయార్క్ లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఐరాస ఈ మేరకు నిర్ణయించింది.
2017 లో ఇండియాలో టీబీ వ్యాధిగ్రస్తుల సంఖ్య 20 లక్షలకు పైగా పెరిగిందట. 29 దేశాల్లో టీబీ నివారణా విధానాలపై గ్లోబల్ చారిటీ మెడిసిన్స్ ఫ్రాంటియర్స్ సర్వే నిర్వహించగా..ముఖ్యంగా భారత దేశానికి సంబంధించి ఈ వ్యాధి డయాగ్నైజ్, డ్రగ్స్, కౌన్సెలింగ్ వంటి విషయాల్లో చాలా వెనుకబడి ఉన్నట్టు తేలింది.
ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ..2100 తరువాతే టీబీ ఫ్రీ ఇండియా సాధ్యపడవచ్చునని ఈ వ్యాధిపై ఏర్పాటైన లాన్సెట్ కమిషన్ తన నివేదికలో తెలిపింది. టీబీ వంటి వ్యాధుల నివారణకు ఇవి సోకిన వ్యక్తులకు న్యూట్రిషనల్ సపోర్టుగా కేవలం 500 రూపాయలు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఇంత స్వల్ప మొత్తం కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది హాస్యాస్పదంగా ఉందని ఆరోగ్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *