కమలా హారిస్.. అమెరికన్ డెమొక్రాట్ల ఆశాకిరణం.. అనుకున్నవన్నీ కలిసొస్తే కాబోయే మొట్టమొదటి అమెరికన్ మహిళా ప్రెసిడెంట్ కూడా. ప్రస్తుతం కాలిఫోర్నియా సెనెటర్‌గా వున్న కమలా.. దేశ అధ్యక్ష పదవికి పోటీ పడబోతున్నట్లు సూచనప్రాయంగా ప్రకటించారు. 2020లో జరగబోయే అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌కి సంబంధించి ఇప్పటికి ఇదే బ్రేకింగ్ న్యూస్. ఏబీసీ మీడియా సంస్థకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు ప్రకటించడంతో పాటు.. “For the People” అనే థీమ్‌తో తన ప్రచారం సాగనున్నట్లు తెలిపారు. ఈ నెల 27న ఆక్లాండ్‌లో జరగబోయే పబ్లిక్ మీటింగ్‌లో అధికారిక ప్రకటన వెలువడనుంది.

‘The Truths We Hold: An American Journey’ పేరుతో ఇటీవల ఒక బయోగ్రఫీ లాంటిది రాసుకున్న కమలా హారిస్.. దాని ద్వారా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని, జన స్పందనను ఎన్నికల ప్రచారంలో ఎక్స్‌పోజ్ చేయనున్నారు. ఇండియా, జమైకాల నుంచి అమెరికా వచ్చిన సగటు వలస కుటుంబాల కూతురిగా తాను ఎలా ఎదిగిందో, ఒక ప్రాసిక్యూటర్ స్థాయి నుంచి సెనెటర్ దాకా తన ప్రస్థానం ఎలా సాగిందో ఆ పుస్తకంలో వివరించింది. ఆమె రాజకీయ నేపథ్యానికి ఈ పుస్తకం ఒక సోపానం లాంటిది. కాస్ట్ ఆఫ్ లివింగ్, సామాజిక న్యాయం, జీవన ప్రమాణాల మెరుగు, ప్రభుత్వ కార్యాలయాలు పోగుట్టుకున్న ప్రతిష్టను మళ్ళీ కూడదీసుకోవడం లాంటివన్నీ ఆమె ప్రచారంలో ప్రధాన అంశాలుగా చెబుతున్నారు. వలస విధానాలు, విద్యాప్రమాణాల్లో సమూల సంస్కరణలే తన ఎజెండాలో కీలకం కానున్నాయి.

2016లో కాలిఫోర్నియా సెనెటర్‌గా ఎన్నికైన హారిస్.. ఆ పదవిని చేపట్టిన మొట్టమొదటి ఇండో-అమెరికన్‌గా చరిత్రకెక్కింది. అంతకుముందు ఆరేళ్ళ పాటు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా చేసి.. అరుదైన అనుభవం గడించింది. ఇప్పుడామె క్యాంపెయినింగ్ లోగో, కలర్ స్కీం చూస్తున్నవాళ్లకు 1972 నాటి అమెరికన్ ఎలక్షన్స్‌లో Shirley Chisholm చేసిన ప్రయత్నం గుర్తుకొస్తోంది. అప్పట్లో ప్రధాన పార్టీల తరఫున అత్యంత పెద్ద పదవికి పోటీ పడ్డ మొట్టమొదటి నల్లజాతీయురాలు Shirley Chisholm. ఇప్పుడదే కోవలో కమలా హారిస్.. చరిత్ర సృష్టించనున్నారు. కొలంబియా, సౌత్ కెరొలినా రాష్ట్రాల నుంచి ప్రచారం ప్రారంభించనున్న కమల.. ట్రంప్ శిబిరంలో ఇప్పటినుంచే వణుకు పుట్టిస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *