మన రవివర్మ గీసిన చిత్రాలనో, పికాసో కుంచెకు రాలిన అద్భుతాలనో చూసి తరాల తరబడి ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాల్సిన అవసరం ఇక ముందు వుండకపోవచ్చు. ఎందుకంటే.. అందమైన బొమ్మల్ని గీసిపెట్టే రోబోలు కూడా మనముందుకొచ్చేస్తున్నాయి. అవును.. ప్రపంచంలోనే మొట్టమొదటి ‘రోబో ఆర్టిస్ట్’ బ్రిటన్లో పుట్టేసింది. ఈ మేరకు ఒక బ్రిటిష్ ఆర్ట్స్ ఇంజినీరింగ్ కంపెనీ సగర్వంగా ప్రకటన జారీ చేసింది.

మనిషిని నిలబెట్టి.. ఆ మనిషి ఎదురుగానే అటువంటి మనిషి బొమ్మనే అచ్చుగుద్దినట్లు గీసిపెట్టగల సామర్థ్యంతో ఒక రోబో తయారైంది. కంట్లో ఒక మైక్రోచిప్.. రోబోటిక్ చేతిలో పెన్సిల్.. ఇవి చాలు.. ఒక మాస్టర్ పీస్ తయారైనట్లే!  సదరు మైక్రో చిప్‌లో హ్యూమన్ ఫీచర్స్‌కి సంబంధించిన అల్గారిథమ్స్ అప్పటికే ఫిక్స్ అయి వుంటాయని, వాటి ద్వారా పూర్తి సహజసిద్ధమైన మనిషి బొమ్మను గియ్యడం వాటికి సాధ్యమవుతుందని చెబుతున్నారు.

దాని రెండు కనుగుడ్లలో ఏర్పాటు చేసిన కెమెరాలు.. హ్యూమన్ ఫీచర్స్ క్యాప్చర్ చేయడమే గాక.. నాన్-స్టాప్‌గా మనతో ఐకాంటాక్ట్ అయి ఉంటాయి. అంటే.. మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మన బొమ్మను గీసిపెట్టడం దానికి సాధ్యమన్నమాట. ‘దాని ఎదురుగా కళ్ళార్పకుండా కూర్చోవడం మాత్రమే మనం చెయ్యాల్సిన పని’ అంటున్నారు రోబో డిజైనర్ ఐడన్ మెల్లర్. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో బొమ్మ గీసే ఈ అరుదైన రోబో ఆర్టిస్ట్‌కి Ai-Da అంటూ నామకరణం కూడా జరిగిపోయింది. త్వరలో ఈ రోబోకి మాట్లాడే సామర్థ్యాన్ని కూడా సమకూర్చబోతున్నారు.

ఈ మొత్తం ప్రక్రియకు Ada Lovelace అనే పేరు పెట్టారు. ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఫిమేల్ కంప్యూటర్ ప్రోగ్రామర్ పేరు.  ప్రస్తుతానికి స్కెలిటన్ షేప్స్‌తో వున్న Ai-Daకి మనిషి రూపురేఖల్ని తీర్చిదిద్దుతున్నారు డిజైనర్ ఐడన్ మెల్లర్. HBO టెలివిజన్ నిర్వహించే Westworld అనే రియాలిటీ ప్రోగ్రాం కోసం ఈ ఇంజనీరింగ్ కంపెనీ ఇటువంటి మరిన్ని అరుదైన ఆవిష్కరణలు చేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *