‘ప్రజాశాంతి’ పేరిట సొంత పార్టీ పెట్టి.. మత ప్రబోధాలు మాని రాజకీయాలు మొదలుపెట్టిన కెఏ పాల్.. ఇప్పుడు ఏపీ పొలిటికల్ చౌరస్తాలో నిలబడ్డారు. తొలి జాబితా అంటూ పది నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించారు. తాను నర్సాపురం ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తనకు దక్కిన హెలికాఫ్టర్ గుర్తును అత్యంత మురిపెంగా చూసుకుంటూ జనంలో తిరుగుతున్నారు కూడా. కానీ.. పాల్ గారి చేతుల్లోంచి ఆ హెలికాఫ్టర్ జారిపోతుందా?

ఏపీలో మంచి స్వింగ్ మీదున్న ప్రధాన ప్రతిపక్షం వైసీపీ.. అధికారంలోకి రావడానికి వున్న అన్ని దారుల్నీ వెతుకుతోంది. అడ్డుపడే శక్తుల్ని ఒక్కటొక్కటిగా నిర్మూలించుకుంటూ వస్తోంది. తాజాగా.. తన ఎన్నికల గుర్తు ‘ఫ్యాను’కు అడ్డొస్తోందన్న అనుమానంతో పాల్ గారి ‘హెలికాఫ్టర్’ మీద పడింది వైసీపీ దృష్టి. ”ఫ్యానును పోలివుండే హెలికాఫ్టర్ కారణంగా క్రాస్ వోటింగ్ జరిగే ప్రమాదం వుంది.. హెలికాఫ్టర్‌ని రద్దు చేయండి..” అంటూ ఈసీ దగ్గర రిక్వెస్ట్ పెడతామంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

ఢిల్లీకెళ్లి ఎలక్షన్ కమిషనర్‌ని కలిసి ‘హెలికాఫ్టర్’ విషయమై పంచాయతీ పెట్టనున్నారు విజయసాయిరెడ్డి. కేంద్రంలో తనకున్న పలుకుబడిని వాడుకుని.. హెలికాఫ్టర్‌ని ఒక పట్టు పెట్టాలన్న యోచనలో వున్నారాయన. ఇటీవల తెరాస అధినేత కేసీఆర్ కూడా ఈసీ దగ్గర ఇటువంటి మెలికే పెట్టారు. కారును పోలి వున్న ట్రక్కు గుర్తుతో మా ఓట్లకు గండి పడుతోంది.. ఆ ట్రక్కు సంగతేంటో చూడండి.. అంటూ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వైసీపీ కూడా ఇదే రకమైన కొర్రీ పెట్టడంతో ఈసీ ఏమంటుందన్నది సస్పెన్స్‌గా మారింది. కెఏ పాల్ మాత్రం చేతులు ముడుచుకుని కూర్చుంటారా?

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *