వైసీపీ వంచన దీక్షలకు ఫుల్ స్టాప్?

నిజానికి ఏపీలో ప్రత్యేక హోదా మీద మూడేళ్ళ నుంచీ రొద పెడ్తున్న ఏకైక పార్టీ వైసీపీ. కానీ.. ఇప్పుడా పార్టీ వాదన అరణ్య రోదనే అవుతోంది. లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తానంటూ చంద్రబాబు చేస్తున్న హడావిడికి మాత్రమే ఎక్కువ ఫోకస్ దక్కుతోందన్న వాస్తవాన్ని ఒప్పుకుని తీరాల్సిందే! ధర్మ పోరాట దీక్షలంటూ భారీ సెట్టింగులతో చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలకు దక్కుతున్న కవరేజ్‌లో పావలా భాగం కూడా ప్రతిపక్ష వైసీపీకి దక్కుతున్న దాఖలా లేదు. ఎవరి విశ్వసనీయత ఎంత, జనం ఏ పార్టీ వెర్షన్‌ని ఎలా తీసుకుంటున్నారన్నది అటుంచితే.. ఎక్స్‌పోజర్ విషయంలో సహజంగానే అధికార పార్టీ పైచేయి సాధిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

 గుంటూరులో వైసీపీ నిర్వహించిన ‘వంచనపై గర్జన దీక్ష’ సభ మొత్తం ఒక వక్తృత్వ పోటీలా సాగింది. ”చంద్రబాబు తీసుకున్న యూటర్న్, హోదా తెచ్చేది ఇచ్చేది జగనే, నాలుగేళ్ల కాపురంలో ఏం చేశారు, ప్యాకేజీలే ముద్దన్నారు ఇప్పుడు వద్దన్నారు..” అన్నీ పాచిపోయిన పంచ్ డైలాగులే! ఆరునెలల నుంచి వింటూ వస్తున్నవే! ఎంత తిట్టినా ఆ నాలుగు తిట్లు తప్ప మరో దారి లేకపోవడంతో.. ఎవరి ధోరణిలో వాళ్ళు అవే పంచ్ డైలాగుల్ని తిప్పితిప్పి కొట్టారు. అంబటి రాంబాబు లాంటి ఉద్దండ పిండాలు సైతం ఆహూతుల్ని అలరించడంలో విఫలమయ్యారు. పృథ్వి లాంటి సినిమా పర్సనాలిటీలొచ్చినప్పుడు కనిపించిన జోష్ తప్పితే మిగతా మొత్తం మూస ప్రసంగాలే! దీంతో.. ఎదురుగా కూర్చున్న పార్టీ కార్యకర్తల్లో సైతం ఓపిక నశించింది. మధ్యాహ్నానికల్లా సభ పల్చబడడం మొదలైంది.

అంతకుముందు ఏప్రిల్ నెలలో విశాఖ, జూన్ 30న అనంతపురంలో ఇటువంటి గర్జన సభలే నిర్వహించింది వైసీపీ. నల్ల చొక్కాలేసుకుని నేతలంతా పద్ధతిగా వచ్చి కూర్చుని, తమ వంతొచ్చినప్పుడు మాట్లాడి వెళ్లారు తప్ప.. వాటి తాలూకు ఇంపాక్ట్ ఎక్కడా లేదు. ఎంపీల రాజీనామా పేరుతో ఢిల్లీ ఏపీ భవన్లో జరిగిన దీక్ష సైతం ఒక ప్రహసనంలా ముగిసిందని, రావాల్సినంత మైలేజ్ రాలేదని ఆ పార్టీ నేతలే ఉస్సూరుమన్నారు. ఇప్పుడు గుంటూరు వేదికగా జరిగిన గర్జన సైతం.. ‘సాక్షి’లో తప్ప మరెక్కడా గాండ్రించలేదని.. కనీసం జగన్ హాజరైనా కొంతలోకొంత లబ్ది చేకూరేదని వైసీపీ శ్రేణుల్లో సణుగుళ్లు లేకపోలేదు. పోరాట పంథాను ఇంతకంటే పటిష్టంగా మార్చుకోవడం ఎలా, స్పెషల్ స్టేటస్ ఇష్యుని చంద్రబాబు హైజాక్ చేయకముందే మేలుకోవడం ఎలా అనే అంశాలపై పార్టీ వ్యూహకర్తలు కొత్త కసరత్తు మొదలెట్టారు.