ఏపీ పాలిటిక్స్‌ని కీలక మలుపు తిప్పనున్న 2019 ఎన్నికల్లో వైఎస్ భార్య విజయమ్మ రోల్ ఎలా వుండబోతోంది..? ప్రతిపక్ష నేత జగన్ తల్లిగా 2014 ఎన్నికల్లో కీలక భూమిక పోషించిన విజయమ్మ.. ఈసారి ఎంతమేర క్రియాశీలకంగా ఉండబోతున్నారు? అనే సందేహాలపై స్పష్టత దొరికింది. జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా మీడియాకిచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె కీలక అంశాల్ని టచ్ చేశారు.

పవన్ కళ్యాణ్ ఒక బూటక రాజకీయ నాయకుడని, చంద్రబాబును ఎలా నమ్మరో, పవన్ కళ్యాణ్‌ని కూడా జనం నమ్మబోరని తెగేసి చెప్పారు వైఎస్ విజయమ్మ. గతంలో విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి హరిబాబు చేతిలో ఓడిపోయిన విజయమ్మ.. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో వుండబోవడం లేదని తేల్చేశారు. జగన్ కోరితే.. పార్టీకి అవసరమనుకుంటే తప్ప ప్రచారం చేయబోనని కూడా చెప్పారు. జనం జగన్ పక్షాన ఉన్నారన్న ధీమా వ్యక్తం చేస్తూ.. వైసీపీ 120 ఎమ్మెల్యే సీట్లు దక్కించుకోవడం ఖాయమన్న భరోసా కూడా ఉందన్నారు వైఎస్ విజయమ్మ.

విజయమ్మ నిరాసక్తత కారణంగా విశాఖ ఎంపీ సీటుపై పార్టీలో ఆసక్తి నెలకొంది. గతంలో ఎన్నికలకు దూరంగా వున్న షర్మిలను ఈసారి పోటీకి పెట్టవచ్చని తెలుస్తోంది. విశాఖ ఎంపీ సీటు మీదే వైఎస్ ఫ్యామిలీ గురి పెట్టిందని.. ఈ మేరకు నిర్ణయం కూడా జరిగిపోయిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ.. అవినాష్ రెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పంపి.. కడప లోక్ సభ స్థానాన్ని ఖాళీ చేసి.. షర్మిలను పోటీ చేయించాలన్న ప్రతిపాదన కూడా పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఉత్తరాంద్రలో వైసీపీ ఉనికి స్థిరపడాలంటే షర్మిలను విశాఖకు పంపాలన్న వినతులు అటువైపు నుంచి వచ్చేస్తున్నాయి.

జగన్ జైలుకెళ్ళడంతో సందిగ్ధంలో పడ్డ ఓదార్పుయాత్రను షర్మిలతోనే పూర్తి చేసింది వైసీపీ. తర్వాత పార్టీ తెలంగాణ బాధ్యతలు అప్పగించడంతో.. తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారామె. కానీ.. మూడేళ్ళుగా మీడియా కంటబడకుండా దూరంగా ఉండిపోయారు. ఎన్నికల సీజన్ మొదలవడంతో షర్మిలమ్మ మళ్ళీ జనంలోకి రావొచ్చని వైసీపీ శ్రేణులు ఆశిస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *