వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి సోషల్ మీడియా మీద ఈ మధ్య బాగా ఇష్టం పుట్టేసింది. తన ట్వీట్ల ద్వారా రాజకీయ వర్గాల్లో చురుకు పుట్టించాలన్న ఆయన తాపత్రయం ప్రతీ పోస్టులోనూ కనిపిస్తుంది. చంద్రబాబును టార్గెట్ చేయడం మీదనే ఎక్కువ దృష్టి పెట్టే సాయిరెడ్డి.. తన అక్కసును, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని కలిపి.. సదరు ట్వీట్‌ని బాగా కరుగ్గా తయారు చేసుకుంటారు. నిజానికి చంద్రబాబుకు విజయసాయిరెడ్డి పెట్టినన్ని నిక్ నేమ్స్ మరెవ్వరూ పెట్టి ఉండకపోవచ్చు.

ప్రతీ పొలిటికల్ సిట్యువేషన్‌నీ తనకు అనువుగా, చంద్రబాబుకు విరుద్ధంగా మలుచుకుని ఆయన చేసే ట్వీట్లు అత్యంత ‘ఆసక్తికరంగా’ ఉంటాయి. తాజాగా విజయసాయిరెడ్డి చంద్రబాబుపై చేసిన ట్వీట్లో టన్నులకొద్దీ ‘సర్కాస్టిజం’ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయడం అలవాటు లేని చంద్రబాబు.. ఈసారి కూడా తోడు కోసం తహతహలాడుతున్నారని, కొత్త పొత్తుల కోసం అర్రులు చాస్తున్నారని, ఫిబ్రవరిలో ‘ఎంగేజ్మెంట్’కి ఏర్పాట్లు చేసుకుంటున్నారని.. ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పాలనుకున్నారు.

కానీ.. ఇందుకోసం ఆయన వాడిన భాష ఇంపుగా లేదని, పెద్దల సభలో సభ్యుడిగా ఆయన హోదాకు తగ్గట్లు లేదని బోలెడన్ని కామెంట్లు పడిపోతున్నాయి. విజయసాయిరెడ్డి ‘దిగజారుడు భాష’ మీద రియాక్షన్లతోనే కామెంట్ బాక్స్ నిండిపోయింది. ఒక రాజ్యసభ సభ్యుడిగా సోషల్ మీడియాలో హుందాగా వ్యహరించడం మంచిదన్న సూచనలు కూడా కనిపిస్తాయి. పైగా.. నెట్టింట ఎంత పద్ధతిగా ఉంటే అంత ‘ఆరోగ్యకరం’ అన్నది తాజా నీతి. లేదంటే విరుచుకుపడ్డానికి సిద్ధంగా వుండే ట్రోలింగ్ జాతికి అడ్డంగా దొరికిపోవాల్సి వస్తుంది. కానీ.. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎంపీ గారు తాకిడి తగ్గించకపోగా పెంచేసే అవకాశాలే ఎక్కువ.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *