శనివారం 11 గంటలకు కన్నడ అసెంబ్లీ అటెండెన్స్!

కర్నాటక కొత్త సీఎం ఎడ్యూరప్ప రేపే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.  ఎడ్డీ ప్రమాణస్వీకారంపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు  ఆయనను ఆహ్వానిస్తూ గవర్నర్ వాజూభాయ్ వాలా తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్-జేడీ-ఎస్ కూటమి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.

ఎడ్యూరప్ప బల నిరూపణకు గవర్నర్ 15 రోజుల వ్యవధినివ్వగా..కోర్టు.. దీన్ని కుదించివేసింది. రేపు సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో ఎడ్యూరప్ప విశ్వాస పరీక్షనెదుర్కోనున్నారు. న్యాయమూర్తులు జస్టిస్ ఎ.కె..సిక్రీ, ఎస్.ఎ.బాబ్డే, అశోక్ భూషణ్‌లతో కూడిన బెంచ్ ఈ తీర్పునిచ్చింది. ఎడ్యూరప్ప బల నిరూపణకు తగినంత వ్యవధినివ్వాలన్న ఆయన న్యాయవాది ముకుల్ రోహాత్గీ అభ్యర్థనను బెంచ్ తోసిపుచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా ఎమ్మెల్యేలు హాజరుకాని  పక్షంలో డీజీపీకి తాము ఆదేశాలిస్తామని పేర్కొన్న కోర్టు-శాసనసభలో ఎవరు బలాన్ని నిరూపించుకుంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది.

అటు.తాము కూడా బల నిరూపణకు సిద్ధమేనని కాంగ్రెస్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కాగా-తమకు 15 రోజుల వ్యవధి అవసరం లేదని, ఆ లోగానే విశ్వాస పరీక్ష నెదుర్కొంటామని ఎడ్యూ రప్ప గురువారం తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేసిన  సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. శనివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ఎడ్యూరప్ప తెలిపారు.