ఈ పండ్లు, ఫలాలు ఎప్పటికీ కుళ్ళిపోవు!

ఈ పండ్లు, ఫలాలు ఎప్పటికీ కుళ్ళిపోవు!

‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అనుకుంటాం! కానీ.. దాన్ని అమల్లో పెట్టడం దగ్గర మాత్రం అలసత్వం ప్రదర్శిస్తాం. అన్నం సంగతి అటుంచి.. వండుకోడానికి తెచ్చుకునే కాయగూరల్ని, తిందామనుకుని కొనుక్కునే పండ్లుఫలాల్ని ఎంతమేర వృధా చేస్తున్నామన్న ధ్యాస ఎంతమందికుంది..? అందుకే చెత్తబుట్టపాలయ్యే ఫలహారాల్ని ఏ విధంగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు..? తద్వారా ఎంత ఆహారాన్ని ఆదా చేయవచ్చు? అనే అంశంపై blinds-hut.co.uk వెబ్ సైట్ ఒక అధ్యయనం చేసింది.

ముల్లంగిని జీరో డిగ్రీస్ సెల్సియస్ వద్ద ఫ్రిడ్జ్ లో పెడితే.. 26 వారాల పాటు పాడవకుండా ఉంటుందని ఎంతమందికి తెలుసు? బ్రొకోలి, క్యాలిఫ్లవర్, ఆప్రికాట్, చెర్రీస్ లాంటివి 2 డిగ్రీస్ టెంపరేచర్ వద్ద స్టోర్ చేస్తే మామూలు కంటే ఎక్కువకాలం మనగలుగుతుంది.

నారింజపండ్లయితే ఏకంగా మూడు నెలల పాటు కుళ్ళిపోకుండా ఉంటాయి. అరటిపండ్లను మాత్రం ఫ్రిడ్జ్‌కి దూరంగా ఉంచాలి. స్వీట్ పొటాటోస్ 30 వారాల పాటు తినగలిగే స్థితిలోనే ఉండేలా దాచుకోవచ్చట. యాపిల్స్ నిర్లక్ష్యంగా ఫ్రూట్ బౌల్స్ లో పడెయ్యకుండా ఆరంజ్ పండ్లతో పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.

చల్లటి ప్రదేశాల్లో ఉంచితే నిమ్మకాయలు, ద్రాక్ష పండ్లు కూడా 24 వారాల పాటు శుభ్రంగా, భద్రంగా ఉంటాయట. ఇలా సరైన ఉష్ణోగ్రత వద్ద, సరైన ప్లేస్‌లో నిల్వ ఉంచడం ద్వారా.. విలువైన పండ్లు, కాయగూరల్ని ‘డస్ట్‌బిన్’ పాలు కాకుండా కాపాడవచ్చు.

చెడిపోయిన వంట సామాను పారబోసుకోవడం ద్వారా ఒక్కో కుటుంబం ఏటా 1,170 రూపాయలు నష్టపోతోందన్నది ఒక అంచనా. కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే మరింత కఠినంగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా 25 శాతం నీళ్లు కేవలం మనం తినకుండా పారబోసే పంటను పండించడానికి ఖర్చు చేస్తున్నాం.

మరో 30 ఏళ్లలో ప్రపంచ జనాభా 230 కోట్లు పెరగవచ్చు. వాళ్ళ కోసం అదనంగా 60 శాతం పంట ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం వుంది. మరి.. ఆహార పంటల అమూల్యతను గుర్తెరగకపోతే.. భవిష్యత్తులో మనిషి మనుగడ సాధ్యమేనా?

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *