సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దాదాపు క్లైమాక్స్‌కి వచ్చేసింది. వారం రోజులుగా పోలీసులు, సిట్ సేకరించిన ఆధారంగా బట్టి అనుచరులే ఆయనను హత్య చేసినట్టు ఓ నిర్థారణకు వచ్చారు. హత్య జరిగిన వెంటనే ఘటన స్థలంలో ఆధారాలు కాపాడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పులివెందుల అర్బన్ సీఐ శంకరయ్యను సస్పెండ్ చేసింది. ఈ మేరకు రేంజ్ డీఐజీ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. రక్తపు మరకలను కడిగేయడం వంటి చర్యలతో కీలకమైన ఆధారాలు దొరికే అవకాశాలు తగ్గిపోయాయని భావిస్తోంది. వివేకా హత్యకు ఆయన అనుచరులు పరమేశ్వర్‌‌రెడ్డి, గంగిరెడ్డి, శేఖర్‌రెడ్డిలు కీలక సూత్రధారులని ఓ అంచనాకి వచ్చింది సిట్.

గురువారం మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, హత్యకు ముందు వినియోగించిన స్కార్పియోను స్వాధీనం చేసుకున్నారు. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య పులివెందులలో శేఖర్ రెడ్డి స్కార్పియోలో తిరిగినట్టు సీసీ కెమెరా పుటేజ్‌లో తేలింది. అలాగే చిన్నా అనే రౌడీ షీటర్ స్కార్పియోలో వారం పాటు తిరిగినట్టు సమాచారం. మొత్తం ఈ కేసులో ఇప్పటికే 40 మందిని ప్రశ్నించిన సిట్, ఒకటి రెండు రోజుల్లోనే కేసు వివరాలను అధికారికంగా వెల్లడించాలని భావిస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *