తమవద్ద ప్రపంచ వినాశనకరమైన భయంకర అణ్వాయుధాలు ఉన్నాయని విర్రవీగే అగ్రరాజ్యం అమెరికా.. ‘ జికా ‘ వైరస్ భయంతో వణికిపోతోంది. మదమెక్కిన ఏనుగు కూడా ఓ చిన్న దోమకాటుకు బేర్ మన్నట్టు విలవిలలాడుతోంది. ఈ క్రమంలో సదా ఇండియాపై ఓ కన్నేసి ఉంచుతున్న అమెరికా పెద్దన్న…. మరేదీ ముఖ్యం కానట్టు జికాతో సతమత మవుతున్న రాజస్తాన్ పై ఫోకస్ పెట్టింది. తమ దేశంలోని గర్భిణులు ఆ రాష్ట్రానికి ప్రయాణించకూడదని సూచిస్తోంది. ఈ మేరకు అక్కడి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ ఓ ఎలర్ట్ వార్నింగ్ జారీ చేసింది. రాజస్తాన్, ఆ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల ‘ ఆ పక్కకు వెళ్ళొద్దని ‘ కోరింది. ఈ వైరస్ సోకిన చాలామందికి ప్రాణాపాయం లేకపోయినా, గర్భిణులకు మాత్రం ఇది హానికరమని, వారికి పుట్టే పిల్లలు అవయవ లోపంతోనో, ఇతర ఆరోగ్య సమస్యలతోనో పుడతారని వైద్య నిపుణులు అంటున్నారు.

రాజస్తాన్లో గత అక్టోబరు, నవంబరు నెలల్లో 153 జికా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ రాష్ట్రంలో తొలి జికా కేసు సెప్టెంబరు 22 న నమోదయింది. పరిస్థితిని సమీక్షించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్,, ఓ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయడమే గాక.. మానిటరింగ్ టీమ్స్ ని కూడా నియమించారు. జైపూర్ లో ఉన్న ఈ కేంద్రం.. జికా కేసులు 50 నుంచి 170 కి పెరిగినట్టు పేర్కొంది. ఇండియాలో మొత్తం 157 జికా కేసులను గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నవంబరులో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా రాజస్థాన్ టూరిజం పరిశ్రమ తీవ్రంగా దెబ్బ తిన్నట్టు అధికారులు తెలిపారు. సుమారు 35 లక్షలమంది దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఆ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడడమే మానుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *